పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు మౌన పోరాట నిరసన దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి పై తనదైన శైలిలో ధ్వజమెత్తారు.
2015 ఆగస్టులో నిట్ ప్రారంభోత్సవం నాడు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి బాబు గారు ఇచ్చిన 56 హామీలకు ఇప్పటివరకూ అతీగతీ లేదని, సభ ఏర్పాటుచేసుకోవడానికి మాత్రం తాడేపల్లిగూడెం పనికొచ్చింది గానీ మెడికల్ కాలేజీ ఇవ్వడానికి పనిచెయ్యలేదా? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికిచ్చిన హామీలు 95శాతం పూర్తిచేస్తే 5శాతం ఉన్నవాటికి మీరు ధర్మపోరాటం చెయ్యడం ఎందుకన్నారు.

మూడువంతుల హామీలు నెరవేర్చిన కేంద్రంపై టీడీపీ ధర్మపోరాటం చేస్తే ఈ నియోజకవర్గానికిచ్చిన 56 హామీలు అమలుచెయ్యని మీపై మేము ఏ పోరాటం చెయ్యాలో చెప్పాలన్నారు.

మీకు చిత్తశుద్ధి ఉంటే మీరిచ్చిన హామీలకు సమాధానం చెప్పాకే ఇక్కడ సభ పెట్టుకోమన్నారు.

మా సభ అడ్డుకోమని ఓ తెలుగుదేశం నాయకుడు సవాల్ విసిరాడని చెన్నారెడ్డినే తరిమిన చరిత్ర ఉన్న మా తాడేపల్లిగూడానికి మీ ముఖ్యమంత్రిని తరమడం పెద్ద విషయమేమీకాదన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి మాలతి రాణి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాకా సత్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షులు కోడూరి లక్ష్మీ నారాయణ గారు, తాడేపల్లిగూడెం స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.