రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు

13వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు.

మైనారిటీలకు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేసే పార్టీ అని చెప్పుకునే మీరు ఈ నాలుగు సంవత్సరాలలో వారికి మీ కేబినెట్ లో స్థానం కల్పించకపోవడం మీ అసమర్థతకు, మోసపూరిత పాలనకు నిలువెత్తు నిదర్శనం కాదా? వారి సామర్ధ్యం మీద నమ్మకం లేదా? గతంలో ఎప్పుడైనా ఈ బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా రాష్ట్ర కేబినెట్ ఉందా? వారికి ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదో ప్రజలకు వివరించవలసిన బాధ్యత మీకు లేదా?

ఉన్నత విద్యారంగ అభివృద్ధికి ఉపయోగించాల్సిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిధులను మీ తుచ్ఛమయిన రాజకీయలకు, మోసపూరిత దీక్షలకు ఉపయోగించడం అన్యాయం కాదా? నిరుద్యోగుల నుండి విద్యార్థుల నుండి చెవులు పిండి వివిధ ఎంట్రన్స్ టెస్టులకు వసూలు చేసే ఉన్నత విద్య మండలి నిధులను విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, పరిశోధనలకు ఉపయోగించాలి. విద్యార్థులతో ముఖాముఖి అని, ప్రత్యేక హోదా చైతన్య సమావేశాలని, ఏదో వంకతో మీ పార్టీ ప్రచారానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుండి కోట్లాది రూపాయలు దుర్వినియోగం మీరు చేయడం లేదా.?

మీ పచ్చ ప్రభుత్వ హయంలో మీ అసమర్థ పాలనలో మీ పచ్చ నాయకులు మరుగుదొడ్లును కూడా వదలటం లేదు కదా! కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాథమిక ఆరోగ్యం కోసం వ్యక్తిగత మరుగుదొడ్లుకు ఇస్తున్న నిధులను కూడా మింగుతున్నారంటే ఎంత దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో! మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన నిధులు, వాటి వినియోగం పై సిబిఐ విచారణకు సిద్ధమేనా?

ఘోరాతిఘోరంగా 29 మంది అమాయక భక్తులు చనిపోయిన గోదావరి పుష్కరాల మీద వేయబడిన సోమయాజులు కమిషన్ రిపోర్ట్ సరైనది అని ఆత్మ సాక్షిగా నమ్ముతున్నారా?
Vip ఘాట్ అయిన సరస్వతి ఘాట్ లో మీరు అసలు ఎందుకు ఉన్నారు? 72 గంటలు ఉండాల్సిన సి. సి.టి.వి ఫుటేజ్ ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకు ఉంచలేదో అన్న విషయాల పై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? సోమయాజులు కమిషన్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో సిబిఐ విచారణను ఆహ్వానించ గలరా? ఇంత మంది అమాయకల మరణం రాష్ట్రానికి శాపం కాదా?